చిత్రం న్యూస్, కుభీర్: కుభీర్ మండలంలోని రంజని తండా నుండి కుబీర్ వెళ్లే రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని గ్రామస్తులు విన్నవిస్తున్నారు.రంజని తండా నుండి కుభీర్ వెళ్లే ప్రధాన రహదారి గత రెండున్నర ఏళ్లుగా అధ్వాన్న స్థితిలో ఉంది. అసంపూర్తిగా నిలిచిపోయిన ఈ రోడ్డు పనుల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని తండవాసులు పేర్కొంటున్నారు.అత్యవసర సమయంలో గర్భిణులని ఆసుపత్రికి తరలించాలంటే ఈ గుంతల రోడ్డుపై ప్రయాణించడం ప్రాణసంకటంగా మారింది. సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు నడపడం అత్యంత ప్రమాదకరంగా మారింది. గతంలో పలుమార్లు విన్నవించినప్పటికీ, ఏ అధికారి కూడా ఈ రోడ్డు పనుల గురించి పట్టించుకోవడం లేదు. ప్రజా సేవ కోసం పనిచేస్తామన్న ఈ ప్రభుత్వం, మా తండా ప్రజల గోడును ఆలకించి, తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా, వెంటనే స్పందించి మాకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


