చిత్రం న్యూస్, అదిలాబాద్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇచ్చిందని అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. రేషన్ కార్డు గల ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత భీమా పథకం రాష్ట్రానికి గర్వకారణమని దీనివల్ల ప్రతి పేద కుటుంబం లబ్ది పొందుతుందని ఆయన తెలిపారు
ఏటీసీ కేంద్రాల్లో చదువుకుని ఐటీఐ విద్యార్థులను ప్రోత్సహించేందుకు నెలకు రూ.2 వేలు స్టైఫండ్ అందించనున్నట్లు తెలిపారు. ఏటీసీ సెంటర్లలో టాటా సంస్థ సహకారంతో ఆదిలాబాద్, ఉట్నూర్ ఐటీఐ కళాశాల విద్యార్థులు స్వయం ఉపాధి పొందేలా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు.గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆదిలాబాద్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం హర్షణీయమని పేర్కొన్నారు. సాత్నాల ప్రాజెక్ట్ రూ. కోటి, మత్తడి వాగు ప్రాజెక్ట్ కి 4.62 కోట్లు, ముఖ్యంగా సీఆర్‌ఆర్ చనాక-కోరట బ్యారేజ్ పనుల కోసం రూ.177.54 కోట్లు కేటాయించగా, అందులో రూ.90 కోట్లు భూసేకరణకు, రూ.87 కోట్లు అదనపు నిర్మాణాలకు కేటాయించినట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సంక్షేమం, ప్రజా అభివృద్ధిని రెండు కళ్లుగా చూస్తూ ఆదిలాబాద్ జిల్లాకు అదనపు నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బండి దేవదాస్ చారి, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గౌలి సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి సిరాజ్, ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కొండూరి రవి, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పరామేశ్వర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొయిన్, ఇర్షద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


