Chitram news
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 1:54 pm Editor : Chitram news

ముథోల్‌లో బేస్‌మెంట్ దశలోనే 30 పడకల ఆసుపత్రి నిర్మాణం

*టీఆర్‌పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గైని సాయి మోహన్ మండిపాటు 

నిర్మల్ జిల్లా:- ముథోల్:మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం ఐదేళ్లుగా బేస్‌మెంట్ దశలోనే నిలిచిపోవడంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు గైని సాయి మోహన్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…2022లో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తికాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ పనులను పట్టించుకోకపోవడం, స్థానిక ప్రజాప్రతినిధులు ఫాలోఅప్ చేయడంలో విఫలమవడం వల్లే నిర్మాణం నిలిచిపోయిందని ఆరోపించారు.

ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్న పాత ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, రోగులు, వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి సేవలు కొనసాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర వైద్యం కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.ఆసుపత్రి నిర్మాణ పనులు ఎందుకు నిలిచిపోయాయి? నిధుల మళ్లింపు జరిగిందా? అనే అంశాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జెడ్లోడ్ శంకర్, టీఆర్‌పీ కార్యకర్తలు పాల్గొన్నారు.