Chitram news
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 8:59 pm Editor : Chitram news

ఆర్జీయూకేటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నియామకంపై విద్యార్థుల నిరసన

చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నియామకంపై దుమారం రేగుతోంది. సోమవారం ఈ అంశంపై తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (TSAS) ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్‌ను కలిసి చర్చించారు. మొదట వైస్ ఛాన్సలర్‌ను కలిసేందుకు కేవలం ఐదుగురు విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలపడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. చివరకు అధికారులు వెనక్కి తగ్గి అనుమతించడంతో, సుమారు 30 మంది విద్యార్థులు వీసీ గదిలోకి వెళ్లి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.TSAS వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజ్మల్ ఖాన్ నేతృత్వంలో విద్యార్థులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా  ఉన్న ఇ.మురళీ దర్శన్ ని ఏ ప్రాతిపదికన ‘అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్’గా నియమించారని విద్యార్థులు ప్రశ్నించారు.ఈ పోస్టుకు సంబంధించి ఎటువంటి పబ్లిక్ నోటిఫికేషన్ , పారదర్శక నియామక ప్రక్రియ చేపట్టకపోవడాన్ని తప్పుబట్టారు. సదరు అధికారి విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నారని, అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వీసీ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులను నేరస్థులలా చూస్తున్నారని, దీనివల్ల క్యాంపస్‌లో భయానక వాతావరణం నెలకొందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నియామక ఉత్తర్వులను తక్షణమే బహిర్గతం చేయాలని, విద్యార్థులపై జరిగిన వేధింపులపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ నియామకంలో నిబంధనలు పాటించకపోతే మురళీ దర్శన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘం స్పష్టం చేసింది.