చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో హీరాసుక జయంతి వేడుకలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, హీరాసుక విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, హీరాసుక ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా ప్రధాన్ సమాజం అభ్యున్నతికి చేసిన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంతో పాటు, ప్రధాన్ సంస్కృతిని కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
హీరాసుక ఆశయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం:
హీరాసుక ఆశయాలు, ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రధాన్ సమాజం ఐక్యంగా ఉండి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి” అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రధాన్ సమాజ నాయకులు, వివిధ పార్టీల నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.

